సాహితీవేత్తలకు “కాశీభట్ల” స్మారక పురస్కారాలు…
NANDYAL Aug20 :- తెలుగు సాహితీవేత్త స్వర్గీయ శ్రీ కాశీభట్ల వేణుగోపాల్ గారి ద్వితీయ వర్ధంతి సభ నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. సాయిబాబా నగర్ లోని రాహుల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీ ప్రియులు స్వర్గీయ కాశీభట్ల వేణుగోపాల్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (అపస్) నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి తొట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ప్రముఖ దంత వైద్యులు, రచయిత డాక్టర్ కురుమేటి కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా, మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి తెలుగు పండితులు శ్రీ అన్నెం శ్రీనివాసరెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. సాహితీ ప్రియులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వర్గీయ కాశీభట్ల వేణుగోపాల్ గారి జ్ఞాపకార్థం తొట్టి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రథమ స్మారక పురస్కారాన్ని డాక్టర్ కురుమేటి కిషోర్ కుమార్ గారికి, ద్వితీయ స్మారక పురస్కారాన్ని అన్నెం శ్రీనివాసరెడ్డి గారికి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా డా. కిషోర్ కుమార్ మాట్లాడుతూ కాశీభట్ల వేణుగోపాల్ గారి పేరు మీద ప్రథమ పురస్కారం అందుకోవడం తన జీవితంలో మరువలేని అదృష్టమని, వేణుగోపాల్ గారి రచనలు తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసాయన్నారు.

అన్నెం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి వేణుగోపాల్ గారి కృషి స్ఫూర్తిదాయకమని, సమకాలీన సమస్యలపై చక్కని కథలు నవలలు రాసి తెలుగు సాహిత్యానికి కాశీభట్ల గారు వన్నెతెచ్చారన్నారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వర్గీయ వేణుగోపాల్ గారి జ్ఞాపకార్థం తమ కుటుంబ సభ్యుల తరపున ఈ పురస్కారాలను ప్రారంభించామని, ఇక నుండి ప్రతి సంవత్సరం సాహితీ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రోటరీ విద్యాసంస్థల అధినేత డివి సుబ్బయ్య, కవులు మాబు భాష, నీలకంఠమాచారి, ఉపాధ్యాయులు తుమ్మల పుల్లయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Arattai