NANDYAL :- నంద్యాల పట్టణంలోని నేషనల్ కంప్యూటర్స్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం నిర్వహించారు.నేషనల్ కంప్యూటర్స్ వ్యవస్థాపక చైర్మన్ శ్రీరామ గురుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు, కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని” వ్యక్తిగత విజయం- సామాజిక బాధ్యత”అన్న అంశంపై ప్రసంగించారు.

ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం చక్కటి ప్రణాళిక రూపొందించుకుని, ప్రణాళిక అమలు చేసి విజయాన్ని అందుకోవాలనే బలీయమైన ఆకాంక్షతో,అకుంఠిత దీక్షతో, సంకల్ప బలంతో, అంకిత భావంతో, క్రమశిక్షణతో, సమయపాలనతో, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనుకున్నది సాధించే దిశలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తూ,నిరంతర కృషి చేయాలని అన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అని కష్టపడే తత్వం ఉన్నవారు తప్పకుండా విజయాలు సాధిస్తారని. వారు సాధించే వ్యక్తిగత విజయం కేవలం తమకు సంపదలు సమకూర్చే విజయంగా మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే విజయంగా మారినప్పుడే ఆ విజయానికి సార్ధకత లభిస్తుందని అన్నారు. సహాయ పడే తత్వం,అందరూ బాగుండాలనే దృక్పథం కలిగి ఉండాలని, సంఘ సేవ అనేది ఒకరోజు మాత్రం చేసే కార్యక్రమం కాదని అది జీవితకాల సామాజిక బాధ్యత అని అన్నారు.

నేషనల్ కంప్యూటర్స్ చైర్మన్ గురుమూర్తి, సీఈవో షణ్ముఖ శ్రీనివాస్ మాట్లాడుతూ నేషనల్ కంప్యూటర్స్ పట్టణంలో ఉన్న నాలుగు కేంద్రాలలో గత పాతిక సంవత్సరాలుగా దాదాపు 50 వేల మందికి కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. లాభాపేక్షతో కాకుండా, విద్యార్థులకు చక్కటి కంప్యూటర్ విజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులలో సామాజిక చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల నిర్వహణలో భాగంగా డాక్టర్ రవి కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులలో మంచి స్ఫూర్తిని కలిగించారని అన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణను నేషనల్ కంప్యూటర్స్ తరపున సత్కరించారు.ఈ కార్యక్రమంలో నేషనల్ కంప్యూటర్స్ చైర్మన్ గురుమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్ గీత, సీఈవో షణ్ముఖ శ్రీనివాసులతోపాటు శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai