NANDIKOTKUR july 24 :- విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్టీ-చర్ మీటింగ్ (PTM–4.0) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ బాలికల పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వార్షిక ప్రగతి నివేదికను సభకు వివరించారు. విద్యార్థులు తమ తల్లుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పర సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరమన్నారు. విద్యార్థుల క్రమబద్ధమైన హాజరు, చదువుపై ఆసక్తి పెంపు, మధ్యలో చదువు మానివేసే పరిస్థితులను నివారించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా కలిసి పనిచేయాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు నిర్దిష్ట వ్యవధిలో విద్యార్థుల ఇళ్లను సందర్శించి తల్లిదండ్రులతో సమావేశమై విద్యా పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. అంగన్వాడీ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, వృత్తి విద్యా కోర్సుల వరకు ప్రతి విద్యార్థి విద్యా ప్రస్థానాన్ని పాఠశాల స్థాయి నుంచే ట్రాక్ చేసే విధంగా రికార్డులు నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో కెరీర్ గైడెన్స్కు ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

సమాజంలో బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి బాలికను కనీసం డిగ్రీ పూర్తయ్యే వరకు చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఆడపిల్లల కోసం బంగారం కూడబెట్టడం కంటే విద్యపై పెట్టుబడి పెట్టడం ఉత్తమమని, విద్యే వారికి ఆర్థిక స్వావలంబన కల్పిస్తుందని పేర్కొన్నారు. తాను కూడా గ్రామీణ ప్రాంతంలోని సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి జిల్లా పరిషత్ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి, పట్టుదలతోనే జిల్లా కలెక్టర్ స్థాయికి చేరుకున్నానని విద్యార్థులతో పంచుకున్నారు. గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమం, తక్కువ మార్కులు విజయానికి అడ్డంకులు కావని, స్పష్టమైన లక్ష్యం, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కలెక్టర్ తెలిపారు.

విద్యార్థులు మార్కుల కోసం మాత్రమే కాకుండా సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని, నిరంతర సాధన ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, “నేను చేయగలను” అనే సానుకూల దృక్పథం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవడం అవసరమని తెలిపారు. శానిటరీ నాప్కిన్ల వినియోగం, టాయిలెట్ పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై ఉపాధ్యాయులు విద్యార్థులకు నిరంతరం అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రభుత్వ ఆస్తులను ప్రతి ఒక్కరూ సొంత ఆస్తిగా భావించి సంరక్షించాలని కోరారు. పరిశుభ్రమైన పాఠశాల వాతావరణం, మొక్కల పెంపకం, వర్షపు నీటి సంరక్షణ వంటి అంశాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యక్తం చేసిన సమస్యలను జిల్లా కలెక్టర్ శ్రద్ధగా విన్నారు. పీఎం శ్రీ పథకం కింద నిర్మించిన మరుగుదొడ్లను త్వరలోనే వినియోగంలోకి తీసుకురావాలని, పాఠశాల ప్రహరీ గోడ బలోపేతానికి చర్యలు చేపట్టాలని, వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ అనుసంధానం 15 రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి తిరిగి విద్యాబాట పట్టించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా పురోగతి, సహపాఠ్య కార్యకలాపాలపై తల్లిదండ్రులకు నిరంతరం సమాచారం అందిస్తూ పాఠశాల-తల్లిదండ్రుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. “మన బడి–మన భవిష్యత్తు”, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు, అటల్ ల్యాబ్స్ వంటి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు.

అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ సహపంక్తి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Arattai