స్వశక్తితో జీవనం సాగించే ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని కాపాడుకుంటూ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాలులో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఉప రవాణా అధికారి శివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా “ఆటో డ్రైవర్ల సేవలో” పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకం కింద ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు, నంద్యాల జిల్లాలో 10,006 మంది ఆటో డ్రైవర్లకు రూ.15 కోట్లు 90 వేల రూపాయల నగదు నేరుగా ఖాతాల్లో జమ చేయబడ్డాయని తెలిపారు. అర్హులైన వారు జాబితాలో లేకపోతే వారిని చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆధార్ లేదా బ్యాంక్ ఖాతా అనుసంధాన సమస్యల కారణంగా కొందరు అనర్హులుగా తేలిన అవకాశం ఉందని, వార్డు మరియు గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించి సరి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

నియోజకవర్గాల వారీగా నంద్యాల – 2,217 మంది, ఆళ్లగడ్డ – 1,294, బనగానపల్లె – 1,170, శ్రీశైలం – 1,654, పాణ్యం – 611, నందికొట్కూరు – 1,697, డోన్ – 1,363. మొత్తం 10,006 మంది ఆటో డ్రైవర్లకు రూ.15 కోట్ల 90 వేల రూపాయలు జమ అయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఆటో డ్రైవర్లకు సరైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులను తరలించే ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

40 సంవత్సరాలు దాటిన డ్రైవర్లు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, కార్మిక శాఖ లేదా ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో తక్కువ ప్రీమియం గల బీమా పొందాలని సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహక మొత్తాన్ని ఆటో రిపేర్లు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్లకు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు

పేదల అభివృద్ధి
పేదల అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద నంద్యాల జిల్లాలో 2.16 లక్షల మంది లబ్ధిదారులకు రూ.92 కోట్లు అందజేయడం జరుగుతోందన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, “తల్లికి వందనం” పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున అందజేయడం జరుగుతోందన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా డీఎస్సీ ద్వారా ఉమ్మడి జిల్లాలో 2,499 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని వివరించారు.

రైతుల సంక్షేమం
రైతుల సంక్షేమం దిశగా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, పీఎం కిసాన్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.20,000 పెట్టుబడి సాయం అందజేస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు రాకపోకల్లో అనేక సౌకర్యాలు కల్పించబడుతున్నాయని, జిల్లాలో 60 శాతం మహిళా ప్రయాణికులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు.

అనంతరం విజయవాడలోని సింగ్‌నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రారంభించిన “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం లైవ్ ప్రసారాన్ని హాజరైన వారు వీక్షించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ స్వయంగా ఆటోలో టౌన్ హాల్ వరకు ప్రయాణించి ఆటో డ్రైవర్లతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో డీఎల్డీవో శివారెడ్డి, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply