NANDYAL July25 :- రైతులకు స్థిరమైన ఆదాయం, పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ధే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శనివారం గడివేముల మండలం కొరటమద్ది గ్రామంలో ఒకే రోజు 1,000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపక కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విబిజి రాంజీ (VBG RAMG) పథకం కింద పండ్ల తోటల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 49,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని, వాటి విస్తీర్ణాన్ని లక్ష హెక్టార్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే ఉద్యాన పంటల వైపు అడుగులు వేయాలని సూచించారు. కొబ్బరి, నారింజ, మామిడి, జామ, సీతాఫలం, జీడిమామిడి వంటి సంప్రదాయ పండ్లతో పాటు డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడో, అంజూర్, యాపిల్ వంటి అధిక ఆదాయాన్ని అందించే పంటలను ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. త్వరలో నంద్యాలలో పండించిన యాపిల్స్ కూడా మార్కెట్లోకి రానున్నాయని పేర్కొన్నారు.

విబిజి రాంజీ పథకం ద్వారా గుంతలు తవ్వడం, మొక్కల సరఫరా, ఎరువులు, నీటి వసతి, సస్యరక్షణ వంటి అన్ని అంశాలకు ప్రభుత్వం మూడు సంవత్సరాలపాటు సహకారం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. పావు ఎకరం నుంచి 2.5 ఎకరాల వరకు భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులందరూ ఈ పథకానికి అర్హులని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ శ్రామికులు, రైతులతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించి పథకం అమలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మొక్కల సంరక్షణ తదితర అంశాలపై వివరించారు.

ఈ సందర్భంగా ఒక మహిళా రైతు కొబ్బరి తోట సాగు గురించి వివరించగా, మొక్కల కొనుగోలు నుంచి వాటి సంరక్షణ వరకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. మొక్కలను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, ఒకవేళ రైతులు స్వయంగా కొనుగోలు చేసినా వ్యయాన్ని ప్రభుత్వం తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు. మూడు సంవత్సరాలపాటు మొక్కల సంరక్షణ కోసం ఉపాధి హామీ మస్టర్ల ద్వారా నెలకు సుమారు రూ.2,200 నుంచి రూ.2,300 వరకు భృతి అందించడంతో పాటు మొత్తం రూ.1.15 లక్షల వరకు ప్రభుత్వ సహాయం లభిస్తుందని కలెక్టర్ వివరించారు.

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు మిశ్రమ పంటలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలను అవలంబించాలని కలెక్టర్ సూచించారు. తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు కలిపి సుమారు 30 రకాల విత్తనాలను చల్లే విధానాన్ని పాటించడం వల్ల నేలలో తేమ నిలిచి పంట దిగుబడి మెరుగుపడుతుందని తెలిపారు. గ్రామంలో పింఛన్లకు సంబంధించిన సమస్యలను కూడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఒకే రేషన్ కార్డుపై ఉన్న అర్హులలో ఒకరికి మాత్రమే పింఛన్ అందుతున్నట్లయితే నిబంధనల ప్రకారం కార్డులను వేరు చేసి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పనులు పూర్తి చేస్తేనే రోజుకు రూ.312 పూర్తి వేతనం లభిస్తుందని కలెక్టర్ ఉపాధి హామీ శ్రామికులకు వివరించారు. సాంకేతిక సహాయకులు సూచించిన కొలతల ప్రకారం పనులు చేయకపోతే కూలీలు రోజుకు రూ.40 నుంచి రూ.50 వరకు నష్టపోతున్నారని తెలిపారు. జిల్లాలో సుమారు 2.5 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నందున ఈ నష్టం సంవత్సరానికి దాదాపు రూ.100 కోట్ల వరకు చేరుతోందన్నారు. ప్రతి శ్రామికుడు పూర్తి స్థాయిలో పని చేసి ప్రభుత్వ కల్పిస్తున్న పూర్తి వేతనాన్ని పొందాలని కలెక్టర్ తెలిపారు. వేసవి కాలంలో పశువుల నుంచి మొక్కలను రక్షిస్తూ, శాస్త్రీయ పద్ధతుల్లో తోటలను సంరక్షించి ఉద్యాన సాగును లాభదాయకంగా మలుచుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు, ఉపాధి హామీ పథకం అధికారులు, సాంకేతిక సహాయకులు, రైతులు, ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు.
Arattai