25వ తేదీ నుంచి నంద్యాల జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
NANDYAL Sep20 :- ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 24, 2026తో ముగియనున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జిల్లా పరిషత్‌ల పరిపాలనను కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి (ఎన్నికలు-నియమాలు) శాఖ G.O.Ms.No.129, తేదీ: 19-09-2026 జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 250-A(1) కింద, నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ జి. రాజకుమారిని నంద్యాల జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అధికారిగా (Special Officer) నియమించింది. ఈ నియామకం సెప్టెంబర్ 25, 2026 నుంచి ఆరు నెలల కాలానికి లేదా ఎన్నికైన జిల్లా పరిషత్ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ తదితర పదవీ బాధ్యతలు స్వీకరించే తేదీ వరకు అమల్లో ఉంటుంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా పరిషత్‌కు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు అందాల్సిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా పరిషత్ పరిధిలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో శాఖల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
మండల పరిషత్‌ల విషయానికి వస్తే, ప్రస్తుత మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం కూడా సెప్టెంబర్ 24తో ముగియనున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 25 నుంచి సంబంధిత మండల పరిషత్‌ల పరిపాలన కొనసాగింపునకు ప్రభుత్వం జారీ చేసే తదుపరి ఉత్తర్వుల మేరకు ప్రత్యేక అధికారుల ద్వారా పరిపాలన కొనసాగనుంది.
Arattai